AP New Ration Cards Update: ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది అర్హత లేని వ్యక్తులు తెలుపు రేషన్ కార్డుల (రైస్ కార్డులు) ద్వారా ప్రభుత్వ ప్రయోజనాలను పొందుతున్నారని, వాటిని తక్షణమే తొలగించాలని NDA ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తర సమావేశంలో TDP ఎమ్మెల్యే గొరంట్ల బుచ్చయ్య చౌదరి, BJP ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, ఈశ్వరరావు, డాక్టర్ పార్థసారథి అర్హత లేని కార్డుదారులను తొలగించాలని కోరారు. నకిలీ కార్డుల వల్ల అర్హులైన పేదలకు నష్టం జరుగుతోందని, అలాగే ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరుగుతోందని వారు అభిప్రాయపడ్డారు.
Advertisement
ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు ప్రకారం, రాష్ట్రంలో 2 కోట్ల కుటుంబాల్లో 1.42 కోట్ల కుటుంబాలకు తెలుపు రేషన్ కార్డులు ఉన్నాయి. కేవలం 8 లక్షల కుటుంబాలే BPL విభాగం వెలుపల ఉన్నాయని ఆయన వివరించారు. ఇది రేషన్ కార్డుల జారీ వ్యవస్థలో లోపాలు ఉన్నాయని స్పష్టంగా చూపిస్తున్నదని పేర్కొన్నారు. కదిరి ఎమ్మెల్యే పార్థసారథి గత YSRCP ప్రభుత్వ హయాంలో అనర్హులకు పెద్ద ఎత్తున కార్డులు మంజూరు అయ్యాయని విమర్శించారు. నకిలీ కార్డులను తొలగించడం ద్వారా నిజమైన పేదలకు నూతన కార్డులు ఇవ్వగలుగుతామని చెప్పారు.
సీనియర్ ఎమ్మెల్యే గొరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, తెలుపు కార్డు ద్వారా అన్ని రకాల ప్రభుత్వ ప్రయోజనాలు పొందే ధోరణి మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు తెలుపు కార్డు అనేదే అన్ని సమస్యలకు పరిష్కారం అని భావించడం తప్పని, నకిలీ కార్డులను తొలగించడమే నిజమైన అర్హులకున్న అవకాశాలను మెరుగుపరచడానికి సరైన మార్గమని చెప్పారు. ప్రభుత్వం సరుకుల మళ్లింపును అరికట్టాలంటే ముందుగా నకిలీ కార్డులను రద్దు చేయాల్సిందే అని అభిప్రాయపడ్డారు.
ఇకపోతే పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ఇప్పటికే 1.46 కోట్ల రేషన్ కార్డులలో 87% కి eKYC ప్రక్రియ పూర్తయిందని, ఇది దేశంలోనే అత్యధికమని వెల్లడించారు. 91% రాష్ట్ర ప్రజలు ప్రజా పంపిణీ పథకం (PDS) కింద కవరై ఉన్నారని తెలిపారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పాటిస్తూ మార్చి 31 నాటికి అన్ని రాష్ట్రాల్లో eKYC పూర్తి చేయాలని ఆదేశించిందని, అందులో ఏపీ ముందువరుసలో ఉందని వివరించారు. ప్రస్తుతం eKYC ప్రక్రియ కొనసాగుతున్నందున కొత్త మార్పులను అనుమతించడం లేదని, మొత్తానికి నకిలీ కార్డులను తొలగించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
Advertisement